వర్క్‌షాప్ అంటేనే ఆయిల్, గ్రీజ్ వంటివి ఉంటాయి. కష్టమైన పని. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో కష్టమైన పనులు మహిళలు ఇష్టంగా చేస్తున్నారు. మనసుపెట్టి చేస్తే.. ఏ పనైనా సులభంగా చేయవచ్చని నిరూపిస్తున్నారు. లాలాగూడ వర్క్‌షాప్‌లో 2 వేల 678 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 265 మంది మహిళా ఉద్యోగులు... వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు సెక్షన్లను పూర్తిగా మహిళలతోనే నడిపిస్తున్నారు. కంపోనెంట్ ఓవర్ హాలింగ్, రైల్వే కోచ్‌ల్లో ఉండే బెర్త్‌ల కుషన్లు చిరిగిపోతే.. వాటికి మరమ్మతులు చేయడం వంటివి చేస్తున్నారు. కర్టెన్లు కుట్టడం తదితర పనులు ట్రిమ్మింగ్ షాప్‌లో చేస్తున్నారు. రోజుకు ఒక్కో మహిళ 8 నుంచి 10 బెర్తుల కుషన్లకు కుడుతున్నారు.
కోచ్‌లకు ఓవర్ హాలింగ్ చేయడం అంటే అంత సులవైన విషయం కాదు. ఇంజిన్లు, వాటి విడి భాగాలను విప్పి.. తిరిగి బిగించాల్సి ఉంటుంది. ఎయిర్ బ్రేక్‌లను సరిచూసుకోవాల్సి ఉంటుంది. కోచ్‌కు సంబంధించిన దాదాపు అన్ని మరమ్మతులు ఇక్కడే చేస్తుంటారు. సాంకేతిక సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కోచ్ ఇక్కడకు చేరుకున్నా.. దాన్ని తిరిగి పట్టాలెక్కిస్తారు. చాలా ఓపికతో, సమన్వయంతో పనిచేస్తుంటామని మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు
లాలాగూడ వర్క్‌షాప్‌లో సుమారు 3వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. వీరందరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్‌లు అందించేందుకు ఇక్కడే క్యాంటిన్‌ను ఏర్పాటు చేశారు. దానిని 12 మంది మహిళలే నిర్వహిస్తున్నారు.
- సరళ మాధవి, మహిళ సంక్షేమ నేత
దక్షిణ మధ్య రైల్వే శాఖలో ట్రాక్ మెయింటనెన్స్‌లో, సిగ్నలింగ్ వంటి విభాగాల్లోనూ మహిళలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో వారి రక్షణ, సౌకర్యం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాం.
- రాకేశ్, ద.మ రైల్వే సీపీఆర్వో
మగవాళ్లు మాత్రమే చేస్తారనుకునే పనుల్ని వాళ్ల కంటే మెరుగ్గా చేస్తూ... రైల్వే వర్క్‌షాప్ మహిళ ఉద్యోగులు అందరి మనన్నలు పొందుతున్నారు.
ఇదీ చదవండి: విమెన్స్ డే స్పెషల్: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం?