కరోనా కట్టడిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యవసర సేవల విభాగాలైన వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసు.... ఇలా అన్ని రంగాల్లోనూ అతివలు కరోనాను తిప్పికొట్టేందుకు పోరాడుతున్నారు. గ్రామస్థాయిలో వ్యాధి ప్రబలకుండా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తూ... ప్రజలను చైతన్యపరుస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా మహిళా పోలీసులు సైతం... రహదారులపై గస్తీ కాస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి అవగాహన కల్పిస్తూ.... మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడమే... తమకిచ్చే గొప్ప బహుమతి అనేది.... వీరంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట.
కరోనాను తరిమికొట్టే యజ్ఞంలో పారిశుద్ధ్య కార్మికులది కీలక బాధ్యత. తమకు వ్యాధి అంటుకునే ప్రమాదమున్నా.. అన్ని ప్రాంతాలతో పాటు కంటైన్మెంట్ జోన్‌లలోనూ సాహసించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన పరిస్థితుల్లోనూ... కిలోమీటర్ల తరబడి నడిచి వెళ్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కోరల నుంచి ప్రజల్ని కాపాడాలనే కార్యం ముందు తమ కష్టాలు పెద్దవి కాదని వారు చెబుతున్నారు. ప్రజల నుంచి సహకారం లేకపోతే... తమ శ్రమంతా వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సృజన... నెల రోజుల పసికందు లాలనను విడిచి... పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనలా మరెందరో తల్లులు... కరోనా నివారణలో తలమునకలయ్యారన్న విషయాన్ని ఆమె గుర్తుచేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!