హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. పలు చోట్ల భారీ వర్షంతో రోడ్లు జలమయమైపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు, కళాశాలలు నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు చుట్టుముట్టింది.
నగరవ్యాప్తంగా విస్తారంగా వాన
నగరంలోని ఇంచు మించు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అమీర్‌పేట్, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, కూకట్పల్లి, ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్, కోఠి, నాంపల్లి, బషీర్‌బాగ్, ఓయూ క్యాంపస్, నాచారం, తార్నాక, మల్లాపూర్ సహా చాలా చోట్ల వర్షం కురిసింది. పలు చోట్ల కుండపోత వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. టోలిచౌకీలో వర్షం నీరు రోడ్లపై చెరువులను తలపించింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది మెట్రోను ఆశ్రయించడంతో.. స్టేషన్లు కిటకిటలాడాయి.
అకస్మాత్తుగా కురిసింది
ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పడలేదు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తడుస్తూ ప్రయాణించారు. బాటసారులు రోడ్లు జలమయమై ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం