ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మహానగర పాలక సంస్థ నాలుగో జోన్ రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న ఓ మధ్యతరగతి కుటుంబం... కరోనా ధాటికి విలవిల్లాడిపోతోంది. మార్చిలో ముంబై నుంచి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్... ఆ తర్వాత కుటుంబం మొత్తానికీ వ్యాపించింది. ఆ కుటుంబానికి అల్లుడైన సదరు వ్యక్తికి ఏప్రిల్ 1న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం 18 నెలల బాలుడు సహా మిగిలిన ఆరుగురు కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగిటివ్‌గా తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ సంతోషం కొద్దిరోజులు కూడా నిలవలేదు.
బాధితుడు కోలుకోగానే.. కుటుంబంలో ఇద్దరికి కరోనా
కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ రావటంతో వైద్యుల సూచన మేరకు వారంతా హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇంతలోపు గీతం ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన యువకుడికి రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా డిశ్చార్జి చేశారు. కుటుంబమంతా ఓ దగ్గరికి చేరి సంతోషంగా గడుపుతున్న సమయంలో... మరో ఇద్దరికి కరోనా సోకిందని వైద్యులు చెప్పడం అందర్నీ కలరపెట్టింది.
ఇద్దరు కోలుకుని వచ్చేలోగా.. మరొకరికి సోకిన వైరస్
పాజిటివ్‌గా మారిన 55 ఏళ్లు, 75 ఏళ్ల వయసున్న ఇద్దరికీ... కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారు కోలుకుని ఇంటికి వచ్చేలోగా.... మొదటి వైరస్ బారిన పడిన వ్యక్తి భార్యకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అలాగే 18 నెలల వయసున్న ఆమె కుమారుడికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. కొంతలో కొంత పర్వాలేదనుకుని తండ్రి వద్దే బాలుణ్ని ఉంచి... తల్లిని కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
18 నెలల చిన్నారినీ వదలని కరోనా..
అలా కొన్ని రోజులు గడిచాక అదే కుటుంబానికి చెందిన 17 ఏళ్ల యువకుడికి కరోనా నిర్ధరణ అయింది. అప్పటికే ఆసుపత్రిలో ఉన్న మహిళ చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేలోపే... చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వార్త కుటుంబాన్ని మరింత ఒత్తిడికి గురిచేసింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే... తొలుత కొవిడ్ బారిన పడిన ముంబై నుంచి వచ్చిన వ్యక్తికి మళ్లీ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం కుమారుడితో కలిసి కొవిడ్ ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. మిగిలిన కుటుంబసభ్యులు క్వారంటైన్ కేంద్రంలో గడుపుతున్నారు. నెలన్నర రోజులుగా నిబంధనలన్నీ పాటించి కరోనాతో పోరాటం చేస్తున్నా... వైరస్ నుంచి విముక్తి దొరక్క ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
ఇదీ చదవండి: పెళ్లిళ్లకు 50 మందే..రెస్టారెంట్ల వద్ద టేక్ అవే