కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలతో మినహాయింపులకు ఇచ్చిన గడువు పూర్తవుతుంది. లాక్డౌన్ పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి గత కొంతకాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అందులో భాగంగానే మినహాయింపుల సమయాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది.
మినహాయింపులు...
ప్రస్తుతం రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపులు ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య, కేసుల నిష్పత్తి ఇటీవల బాగా తగ్గింది. కేసుల సంఖ్య కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి. గురువారం వైద్యారోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం గురువారం పాజిటివిటీ రేటు 1.24 శాతం ఉండగా... రికవరీ రేటు 96.21 శాతానికి చేరింది.
లాక్డౌన్ ఎత్తివేసే దిశగా...
వైరస్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేసి వివిధ రంగాల కార్యకలాపాలకు మార్గం సుగమమం చేసే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయని, వివిధ వర్గాల వారికి తగిన ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కూడా కాస్త సడలించే అవకాశం కనిపిస్తోంది.
రాత్రి కర్ఫ్యూ...
రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం కొనసాగించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాత్రి 8 గంటలు లేదా 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉండే అవకాశం ఉంది. జనం గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఉత్సవాలపై మాత్రం ఆంక్షలు కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ ఎత్తివేసే పరిస్థితులు వస్తే మాత్రం కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కఠినంగా నిబంధనలు...
జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రదేశాలు, మార్కెట్లు, దుకాణాలు ఇతరత్రా చోట్ల కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేసేలా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు పోలీసు, ఇతర శాఖలు, మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడో, రేపో లాక్డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ, ఆంక్షలకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ఇదీ చదవండి: CM KCR: ఈ నెల 22న వాసాలమర్రికి సీఎం కేసీఆర్