What Will Happen in your body if you stop smoking : ధూమపానం ఎలాగో అలవాటవుతుంది.. కానీ, ఆ అలవాటును మానుకోవడానికి మాత్రం నానా అవస్థలు పడుతుంటారు. మనిషిని అంతలా బానిసగా మార్చుకునే ఈ అలవాటు.. కొంత కాలం త్వరగా మెల్ల మెల్లగా ఆరోగ్యానికి కాల్చేయడం మొదలు పెడుతుంది. కొద్ది కొద్దిగా మనిషిని తినేస్తుంది! అందుకే.. ధూమపానం నష్టం తెలిసిన వారంతా బేషరతుగా మానుకోవాలని సూచిస్తుంటారు. ఇది వ్యక్తి ఆరోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి.. పొగతాగడం మానేసిన తర్వాత ఒంట్లో ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.
30 నిమిషాల్లో..
మీరు ఆఖరి సిగరెట్ లేదా బీడీని ఆర్పేసిన 30 నిమిషాల్లోనే.. ధూమపానం కోరల్లోంచి మీ ఆరోగ్యానికి విముక్తి కలిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. లోపల దెబ్బతిన్న అవయవాలను శరీరం రిపేర్ చేసే ప్రక్రియ మొదలు పెడుతుంది. పొగాకులోని నికోటిన్, ఇతర రసాయనాల వల్ల పెరిగిన రక్తపోటు, హృదయ స్పందన రేటు.. క్రమంగా తగ్గే పని స్టార్ట్ అవుతుంది.
9 గంటల్లో..
అప్పటి వరకూ పొగచూరిన మీ రక్తంలో.. కార్బన్ మోనాక్సైడ్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. మీ శరీరంలోని కణాలు రిలాక్స్ అవడం మొదలు పెడతాయి. పొగతో సతమతం అయిన ఊపిరితిత్తుల పనితీరులు.. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాయి.
24 గంటల్లో..
మీరు పొగతాగడం మానేసి సక్సెస్ ఫుల్‌గా ఒక రోజు గడిచింది. దీంతో.. మీ గుండె వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం నిన్నటి వరకూ ఎంత ఉందో.. ఆ ప్రమాద తీవ్రత తగ్గడం ప్రారంభమవుతుంది! రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ చాలా వరకు తొలగిపోతుంది. ఫలితంగా.. మీ గుండె ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉన్న రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది.
రెండు రోజుల్లో..
అప్పటి వరకూ పొగ ప్రభావంతో నిస్తేజంగా ఉన్న నరాలు.. కాస్త ఉత్తేజం పొందడానికి ప్రయత్నిస్తుంటాయి. నాలుక మీది టేస్ట్ బడ్స్ కూడా రిలీఫ్ అవుతుంటాయి. వాసన చూసే కెపాసిటీ కూడా కోలుకుంటూ ఉంటుంది. తినే తిండి కాస్త రుచిగా అనిపిస్తుంది.
మూడు రోజుల్లో..
అప్పటి వరకూ శ్వాస తీసుకోవడంలో ఎదురైన ఇబ్బంది.. 72 గంటల తర్వాత కాస్త తగ్గడాన్ని మీరు గమనిస్తారు. బ్రోన్చియల్ ట్యూబ్స్ ఫ్రీ కావడం వల్ల.. శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. పొగతాగడం వల్ల తరచుగా వచ్చే దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థకు రిలీఫ్‌గా అనిపిస్తుంది.
3 నెలల్లో..
హెల్త్ రికవరీ వేగవంతమవుతుంది. మీ శరీరం అంతటా.. బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా కొనసాగుతుంది. ఊపిరితిత్తులకు బూస్టింగ్ వస్తుంది. దగ్గు, ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు మరింత తగ్గడాన్ని మీరు గుర్తిస్తారు.
సంవత్సరంలో..
మీరు దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం ఎంత తగ్గి ఉంటుందంటే.. ప్రస్తుతం పొగ తాగుతున్న వ్యక్తితో పోలిస్తే సగానికి తగ్గుతుంది. ఏడాది కింద పొగాకు హానికరమైన ప్రభావాలతో నిండిపోయిన మీ హార్ట్ వాల్వ్ వ్యవస్థ.. ఇప్పుడు గణనీయమైన రిలీఫ్ పొందింది. ఊపిరితిత్తులలోని సిలియా, శ్వాసకోశ వ్యవస్థ నుండి శ్లేష్మం వంటి వాటిని బయటకు పంపే వ్యవస్థలు సాధారణంగా మారిపోతాయి. ఈ మార్పు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
5 నుండి 15 సంవత్సరాల్లో...
పొగతాగడం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. మీ శరీరంలో స్టోర్ అవుతూనే ఉన్నాయి. గుండెపోటు రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించే రేటు కూడా తగ్గుతుంది. అనేక ఇతర క్యాన్సర్ల ప్రమాదం కూడా క్రమంగా తగ్గుతుంది. మీ శరీరం మీకు అందిస్తున్న ట్రీట్ మెంట్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంటుంది.
15 సంవత్సరాల తర్వాత...
ఇప్పుడు మీ గుండె, లంగ్స్ ఎలా ఉంటాయంటే.. ఎప్పుడూ పొగతాగని వ్యక్తికి దాదాపుగా సమానంగా ఉంటాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం దాదాపు పూర్తిగా తగ్గిపోయినట్టే.
ధూమపానం ఎంతటి నష్టం కలిగిస్తుందో.. దాన్నుంచి తిరిగి కోలువడానికి ఎంత సుదీర్ఘ కాలం పడుతుందో.. అర్థమైంది కదా! అందుకే.. ప్రతి ఒక్కరూ పొగతాగడం బంద్ చేయాల్సిందే. తద్వారా.. వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు కుటుంబ ఆరోగ్యాన్నీ రక్షించుకున్నవారవుతారు.