గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయాలని, ఏప్రిల్ 12న వార్డుల వారీ తుది ఓట్లర జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీలకు సాధారణ ఎన్నికలు, 9 జిల్లాల్లోని 20 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని... వాటితో పాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఎస్ఈసీ చెప్పారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఒక జడ్పీటీసీ, 58 ఎంపీటీసీ, 123 సర్పంచ్, 2,275 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
వార్డుల వారీ ఓటర్ జాబితా తయారీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, 12న తుదిజాబితా ప్రకటించాలని తెలిపారు. త్వరలో పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు నోటిఫికేషన్, ఆ తర్వాత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన ఇస్తామని పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్, సామగ్రిని సమకూర్చుకోవాలన్న ఎస్ఈసీ... పోలీసు అధికారుల సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: అసైన్మెంట్లు ఇంట్లో రాయండి... మెయిల్ ద్వారా పంపండి: ఇంటర్ బోర్డ్