గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader batti vikramarka), రేణుకా చౌదరి (renuka chowdary) మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో భట్టి చర్యలతో సమస్యలు వస్తున్నాయని రేణుక చౌదరి ప్రస్తావించారు. రేణుక వ్యాఖ్యలతో విభేదిస్తూ తాను సీఎల్పీ నాయకుడిని అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎల్పీ నేత అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించవద్దని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు. మీరు భాగస్వామ్యం అయితే పరిస్థితులు మెరుగుపడాలని సూచించారు. రేణుక చౌదరి వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క మౌనం దాల్చినట్లు తెలుస్తోంది.
ఓటమిపైనా వాడీవేడి చర్చ
కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో.. హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమిపైనా వాడీవేడి చర్చ జరిగింది. గతంలో జరిగిన ఎన్నికలపై సమీక్ష జరగలేదని సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుపట్టారు. ఓటములపై సమీక్ష లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న వీహెచ్.. ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలని చురకలంటించారు. వీహెచ్ ప్రశ్నలకు నేతలు మిన్నకుండి పోయారు. దామోదర రాజనర్సింహ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
జగ్గారెడ్డి ఆవేదన
వాస్తవాలు చెబితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాలు మాట్లాడనని చెప్పారు. స్థానిక ఎన్నికలపై మాణిక్యం ఠాగూర్, బోస్ రాజుకు ఏం తెలుసన్న జగ్గారెడ్డి.. పార్టీ భేటీలో చెప్పాల్సిన విషయాలు చెబుతానని వెల్లడించారు. నోటీసులు ఇస్తారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు.