కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తమపై విమర్శలు వచ్చిన ప్రతిసారి.. పాకిస్థాన్, కశ్మీర్, అయోధ్య రామమందిరం వంటి ఇతర సమస్యలను తెరపైకి తీసుకువస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. స్థానికంగా వచ్చిన అవకాశంతో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి నియోజకవర్గం వైపు ఒక్కసారి కూడా చూడలేదని మండిపడ్డారు.
రెవెన్యూ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఎల్ఆర్ఎస్పై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్లకు ఆస్కారం లేకుండా మొత్తం ఆన్లైన్ విధానం జరుగుతుంటే.. హర్షించాల్సిందిపోయి అనవసరపు విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని నందనవనంలో మంత్రి తలసాని.. నియోజకవర్గ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికలకు నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుని ప్రగతికి బాటలు వేసే అభ్యర్థికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.