ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారనంటూ ఏపీ విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. అధికారులు జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు ఎందుకు కూల్చుతుందో చెప్పడం లేదని యాజమాన్యం అంటోంది. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో బీచ్ రోడ్డు మీదుగా గీతం విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు రెండువైపులా మూసివేశారు. కూల్చివేత సమాచారం తెలిసి తెదేపా శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నాయి.
ముందస్తు సమాచారం లేకుండానే..
తెల్లవారుజామునే తమకు సమాచారం వచ్చిందని వర్సిటీ సిబ్బంది తెలిపారు. వర్సిటీకి వచ్చేలోపే ఎవరినీ లోపలికి అనుమతించలేదని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్నామన్నారు. ముందస్తు సమాచారం లేకుండా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మార్కింగ్ ముందే చేశారనడం అవాస్తవమని, ఇప్పుడు చేస్తున్నారని పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం