ఏపీ లోని విశాఖ జిల్లాలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితుల్ని ఇంకా కలవరపెడుతునే ఉంది. ప్రమాదం జరిగి నెల గడుస్తున్నా... నేటికీ చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంకా అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కొందరికి పూర్తి పరిహారం అందలేదు. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన కొందరికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల బాధిత గ్రామాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ బృందం పర్యటించింది.
ఆసుపత్రుల్లో 2,3 రోజులకు మించి చికిత్స పొందిన వారిలో 15 మందిని పలకరించింది. రూ.75 వేల చొప్పునే ఇచ్చారని వారు చెప్పారు. తామంతా ఆసుపత్రుల్లో చేరామని, రూ.లక్ష చొప్పున పరిహారం రాలేదని మరో 40 మంది చెప్పారు. ఇలా దాదాపు వంద మంది వరకున్నారని వివరించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందిన వారిలో ఒక్కరికే రూ.10 లక్షల పరిహారమిచ్చారు. మరో ఇద్దరు వెంటిలేటరుపై చికిత్స పొందారని పరిశీలనలో తేలింది. వీరికి రూ.10 లక్షల పరిహారం అందలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 166 మందినే అధికారులు గుర్తించారు. మిగిలిన వారిని పరిగణనలోకి తీసుకోకపోవటం కూడా సమస్యాత్మకంగా తయారైంది.
35 గాయాలు.. 4 శస్త్రచికిత్సలు
స్టైరీన్ లీకైన రోజున మా కుటుంబీకులను కాపాడుకున్నా. చుట్టుపక్కల వారిని రక్షించేందుకు అక్కడే ఉండిపోయా. అదే నా ప్రాణాలమీదకొచ్చింది. ఆవిరిని బాగా పీల్చేయడంతో అపస్మారకంలో పడిపోయా. శరీరమంతా ఆవిరి పట్టేసింది. మా వాళ్లు నన్ను క్వీన్ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఐసీయూ, వెంటిలేటర్‌పై పది రోజుల పాటు ఉన్నా. ఆసుపత్రిలో మొత్తంగా 20 రోజులున్నా. ఆ తరువాత పోర్టు ఆసుపత్రికి మారా. నా శరీరమంతటా 35 వరకు తీవ్ర గాయాలయ్యాయి. చెవులను పట్టుకుంటే చివర్లు ఊడిపోయే స్థితిలో ఆసుపత్రికొచ్చా. కాలిమడమపై చర్మం ముద్దలా కాలింది. చెవులకు, ముక్కుకు, కాళ్లకు మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. కాలికి శుక్రవారం మరోసారి శస్త్రచికిత్స చేశారు. వీపు, ఇతర భాగాల్లోని గాయాలు ఇప్పుడిప్పుడే నయమవుతున్నాయి. ప్రభుత్వ పరిహారం అందలేదు. రాత్రయితే మాట్లాడలేకపోతున్నా. మగతగా ఉంటోంది. -జి.కన్నాజీ, వెంకటాపురం
రూ. 75 వేల చెక్కు ఇచ్చారు..
ఆవిరి ఘాటుకు అస్వస్థతకు గురై 2రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాం. ఇప్పటికీ ఆయాసంగా ఉంటోంది. గత ఆదివారం రూ.75 వేల చెక్కునిచ్చారు. మిగిలిన 25 వేలను తరువాత ఇస్తామంటున్నారు. మా కుటుంబంలో మరో వ్యక్తికీ రూ.75 వేలే ఇచ్చారు. మాకు తెలిసి మరో పదిమందికీ అలానే ఇచ్చారు.
-గేదెల బాలామణి, వెంకటాద్రి గార్డెన్స్
ఆసుపత్రిపాలైనా ఆదుకోలేదు
ఆవిరి దెబ్బకు నా భర్త, ఇద్దరు పిల్లలు, నేను నురగలు కక్కి అపస్మారకంలోకి వెళ్లిపోయాం. ఎవరో మమ్మల్ని ఇంట్లోంచి రోడ్డుపైకి తెచ్చి వదిలేశారు. విషయం తెలిసి మా అమ్మవాళ్లు వచ్చి మమ్మల్ని హెల్త్‌సిటీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలోనే ఉన్నాం. నా పిల్లలైతే రెండు రోజులపాటు స్పృహలోనే లేరు. మా నలుగురికీ ఆక్సిజన్ పెట్టి చికిత్స చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు రూ.లక్ష చొప్పున పరిహారం అందలేదు. రూ.పదివేల చొప్పున మాత్రమే ఇచ్చారు. రిపోర్టులతో డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్తే కలెక్టర్‌ను కలవమంటున్నారు. అక్కడికెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు.
- ఎం.నూకరత్నం, వెంకటాద్రి గార్డెన్స్
న్యాయం చేస్తాం : కలెక్టర్ వినయ్‌చంద్
విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన జాబితా ప్రకారం బాధితులందరికీ పరిహారం ఇచ్చామని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. మరికొందరికి రూ.75 వేలే ఇచ్చారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అంతకుముందు రూ.25 వేలు ఇచ్చామని, మిగిలిన రూ.75 వేలు తరువాత ఇచ్చామని చెప్పారు. ఇంకా ఎవరికైనా అందలేదంటే విచారిస్తామన్నారు. ఆ బాధితులను గుర్తించే బాధ్యతను జేసీ అరుణ్‌బాబుకు అప్పగిస్తున్నామన్నారు. వారు ఆయన్ని కలవవచ్చని అన్నారు.
ఇదీ చదవండి : 'అసలు స్టైరీన్ ఎలా విడుదలైందో తేల్చలేదు'