తాటి దుంగల స్తంభాలు, రెల్లుగడ్డి పైకప్పుతో నిర్మించిన విశాలమైన పాక.. కల్లాపి చల్లి.. రంగవల్లులతో తీర్చిదిద్దిన నేల.. చుట్టూ పచ్చని చెట్లు, పచ్చికబయళ్లు, పక్కన నీటి కుంట.. పక్షుల కిలకిలారావాలు.. చూసిన వెంటనే పల్లెల్లో గడిపిన తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చేలా, మనసుకు రెక్కలు తొడిగేలా ఉన్న ఈ ‘పర్ణశాల’.. శంషాబాద్ సమీప ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఉంది.
తెలుగుదనం, పల్లెతనం కలబోసిన ఈ నిర్మాణాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక అభిరుచితో 2017లో నిర్మించుకున్నారు. ఇందుకోసం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 42 తాటి దుంగలు తెప్పించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు.. కుటుంబసభ్యులు, అతిథులతో కలిసి ఉపరాష్ట్రపతి ఇందులోనే భోజనం చేస్తుంటారు. ఇటీవల ట్రస్ట్‌కు వచ్చిన వెంకయ్యనాయుడు.. బ్యాంకుల అధికారులతో సమావేశం అనంతరం పర్ణశాలలో అల్పాహారం తీసుకుంటూ ఇలా కనిపించారు.
ఇదీ చూడండి: smartphone usage: స్మార్ట్ ఫోన్లతో చిన్నారుల సావాసం.. ఆరోగ్యంపై దుష్ప్రభావం