చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఫిక్కీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ‘స్వతంత్ర భారత అమృతోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఫిక్కీ ఛైర్‌పర్సన్ ఉమా చిగురుపాటి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
ప్రసూతి మరణాల సంఖ్యను తగ్గించడంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని, ఈ సంఖ్యను 2030 నాటికి మరింత తగ్గించాలన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారిత, సాధారణ ప్రసూతి అంశాల్లో డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఆమెకు 29వ యుధ్‌వీర్ స్మారక పురస్కారాన్ని ఆన్‌లైన్‌లో ప్రదానం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉర్దూ, హిందీ మిలాప్ పత్రికల వ్యవస్థాపకుడు దివంగత యుధ్‌వీర్ చిత్రపటం వద్ద ఆయన నివాళులర్పించారు.
అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ ఆశా వశిష్ట్, ఇండియన్ నేవీ లెప్టినెంట్ కమాండర్ వర్టికా జోషి, ఇండియన్ ఆర్మీ విశ్రాంత కెప్టెన్ శాలినీసింగ్ మాట్లాడారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షులు ఉజ్వల సింఘానియా, గౌరవ కార్యదర్శి రాధికా అగర్వాల్, సీనియర్ వైస్ ఛైర్‌పర్సన్ సుబ్రమహేశ్వరి, వైస్ ఛైర్‌పర్సన్ రీతు షా, కోశాధికారి సుజిత చిట్యాల, సంయుక్త కార్యదర్శి గుంజన్‌సింధీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా యోధులకు మరో ఆరు నెలలపాటు బీమా