రొమ్ము క్యాన్సర్, రొమ్ము సంబంధిత సమస్యలతో బాధపడుతూ... మానసికంగా కుంగి పోతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఉషా లక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఇందుకోసం యూబీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు అండగా... ఆత్మ స్థైర్యం నింపేందుకు రొమ్ముక్యాన్సర్ని జయించిన మహిళలే ఈ హెల్ప్‌లైన్ లో అందుబాటులో ఉండటం గమనార్హం. దేశంలోనే మొట్టమొదటి సారిగా రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా యూబీఎఫ్ హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్యాన్సర్కయ్యే చికిత్స ఖర్చును తగ్గించాలి
దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో మొదటి స్థానంలో నిలుస్తోంది రొమ్ము క్యాన్సర్. అయితే ఈ మహమ్మారి కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు. మానసికంగాను కుంగదీస్తోంది.ఈ నేపథ్యంలో క్యాన్సర్ సహా రొమ్ము సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఉషా లక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. క్యాన్సర్ చికిత్స పొందే సమయంలో... రొమ్ములో ఇతర ఇబ్బందులు వచ్చిన మహిళలకు ఆయా సమస్యలపై అవగాహన కల్పించడం సహా... వారికి మనోధైర్యం ఇచ్చేందుకు హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. యూబీఎఫ్ ప్రారంభ కార్యక్రమంలో యూబీఎఫ్ సీఈఓ డాక్టర్ రఘురామ్, ఫౌండేషన్ ఛైర్మెన్ డాక్టర్ ఉషా లక్ష్మీ, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజాన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చులను అత్యవసరంగా తగ్గించాల్సి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్ కీలకపాత్ర.బ్రెస్ట్ క్యాన్సర్ విజేతలు అవగాహన కల్పించడం సంతోషకరమైన విషయం. క్యాన్సర్ విజేతల మాటలు బాధితులకు భరోసానిస్తాయి. క్యాన్సర్వల్ల రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్యాన్సర్ చికిత్సల వ్యయాన్ని తగ్గించాలి. రొమ్ము సంబంధ సమస్యలను క్యాన్సర్‌గా భావించవద్దు. ప్రజారోగ్య వ్యవస్థలో ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతుంది. పథకంలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలి. -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.
అవగాహన లేకపోవడం వల్ల
రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఏటా సుమారు1.62 లక్షల మంది కొత్తగా మహమ్మారి భారిన పడుతుండగా.... 87వేల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. రొమ్ము సమస్యలపై మాట్లాడేందుకు మహిళలు ఇప్పటికీ సిగ్గు పడుతుండటం, సరైన అవగాహన లేకపోవడం... సమస్య పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాధి సోకినట్టు గుర్తించిన మహిళలలు కీమో, రేడియో థెరపీలు తీసుకునే సమయంలో శారీరకంగా వచ్చే మార్పులు సహా భయం, ఆందోళన కారణంగా తీవ్ర మనో వేదనకు గురవుతుంటారు.
నిపుణుల సూచనలతో..
అలాంటి వారు యూబీఎఫ్ హెల్ప్‌లైన్‌ని సంప్రదించినప్పుడు క్యాన్సర్‌ని జయించినవారే అవగాహన కల్పించడం ప్రత్యేకం. ఫలితంగా తమలాంటి వారు ఎంతోమంది ఈ మహమ్మరిని జయించారన్న భావన బాధితుల్లో కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈహెల్ప్లైన్ని కాంటాక్ట్ చేసిన వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటే వారిఫోన్ని సోసైటీ ఆఫ్ హెల్త్ సైకాలజిస్ట్ సభ్యులకు కలుపుతారు. ఆ సమయంలో నిపుణులైన వైద్యులు బాధితులకు వ్యాధి పట్ల అవగాహన కల్పించనున్నారు.
మూడు భాషల్లో...
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్ సేవలను త్వరలోనే 12 భాషల్లోకి విస్తరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రొమ్ము సంబంధిత సమస్యలున్న వారు తప్పక హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఇదీ చూడండి: NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?