Vangaveeti Radha : వంగవీటి రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదని.. ఆయన్ను ఏపీ మొత్తం ఆరాధిస్తుందని ఆయన తనయుడు వంగవీటి రాధా అన్నారు. విజయవాడ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రంగా కాంస్య విగ్రహాన్ని రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకు.. భారీ ర్యాలీతో, బాణా సంచాతో అభిమానులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెదేపా, వైకాపా, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం తనకు 'రంగాగారి అబ్బాయి'గా దక్కిందని రాధా అన్నారు.
తన తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఏపీ నలుమూలలా ఆయన పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధని అన్నారు.
రంగా అభిమానులు అంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న రంగా శిష్యులు, అభిమానులు విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు. పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చని, రంగా కుమారుడిగా ప్రజలు చూపించే అభిమానం అనంతమని స్పష్టంచేశారు. ఈ జన్మకు రంగా కొడుకు అనే ఆదరణే తనకు సంతృప్తినిస్తుందన్నారు.
ఇదీ చూడండి : TS Budget Session: బడ్జెట్ తేదీల ఖరారుపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం