రాష్ట్రంలో సుమారు 80 లక్షల మందికి తొలివిడతలో కొవిడ్ టీకాలను ఉచితంగా అందజేయనుండగా... వారిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బంది సుమారు 4 లక్షలమంది ఉంటారని అంచనా. ఇప్పటికే మూడున్నర లక్షలమంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బంది మరో 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తోంది.
వారి పేర్లను కొవిన్ యాప్‌లో పొందుపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. వీరందరికీ పూర్తికావడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయం పట్టవచ్చని అంచనా. ఆ తర్వాత మార్చిలో 50 ఏళ్లు దాటిన, ఆ లోపు వయసులో దీర్ఘకాలిక సమస్యలున్నవారికి టీకాలను ఇవ్వనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. అత్యధిక సంఖ్యలో కొవిడ్ టీకా పొందేవారు 50 ఏళ్లు పైబడినవారే.
రెండు కేటగిరీల్లో 91 శాతం మంది...
ఈ కేటగిరీలో సుమారు 66 లక్షల మంది ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరితోపాటు 18 నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక రోగులు సుమారు 7 లక్షలమంది ఉంటారని భావిస్తోంది. ఈ రెండు కేటగిరీల లబ్ధిదారులు కచ్చితంగా ఎందరు ఉంటారనే విషయంలో స్పష్టత లేదు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో తొలివిడతలో ఉచితంగా టీకాలు పొందనున్నవారిలో 91 శాతం మంది ఈ రెండు కేటగిరీల్లోనే ఉన్నారు.
ఒక్కొక్కరికి 2 డోసులు...
రాష్ట్రానికి మరో 3లక్షల 48వేల 500 కొవిషీల్డ్ టీకాలు మంగళవారం చేరాయి. గతంలో 3.84 లక్షల టీకాలు రాగా.. మొత్తంగా రాష్ట్రానికి 7లక్షల 32వేల 500 టీకాలు వచ్చినట్లైంది. కొత్తగా వచ్చిన టీకాలు ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు లక్షా 90వేల మంది వైద్య సిబ్బందికి ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున సరిపోతాయి.
పూర్తవడానికి 6 నెలలు...
ఈనెల 25 నుంచి వారికి పంపిణీ మొదలుపెట్టనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. ఈ క్రమంలో అన్ని కేటగిరీల వారికి టీకాల ప్రక్రియ పూర్తవడానికి కనీసం మరో 6 నెలలైనా పట్టే అవకాశాలున్నాయి. వచ్చే జూన్, జులై వరకూ ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియను సజావుగా సాగిస్తున్నారంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం అభినందించింది.
ఇదీ చూడండి: మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్ కొనుగోలు!