రాష్ట్రంలోని నలుమూలలకు కరోనా వైరస్ వ్యాపించిందని... ప్రభుత్వ వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.
''అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పతులను సీఎల్పీ నేతలు సందర్శిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆస్పత్రుల సందర్శనలో పాల్గొంటారు. లక్షలు ఖర్చు చేసినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకట్లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. పక్కనున్న ఏపీలో ప్రతిరోజూ 75 వేలకు పైగా కొవిడ్ పరీక్షలు చేస్తుంటే... మన రాష్ట్రంలో సరైన సంఖ్యలో పరీక్షలు ఎందుకు చేయట్లేదు? ఎంతమంది ప్రశ్నించినా ప్రభుత్వం కొవిడ్ పరీక్షలను పెంచట్లేదు.''
-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను కూడా ప్రభుత్వం దాస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత