తెలంగాణ రాష్ట్రంలో తెరాస, భాజపాలు కలిసి నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో తాము ఆరోపిస్తున్నా పట్టించుకోలేదని...ఇప్పుడు భాజపా కూడా అదే అంశాన్ని తెరపైకి తెస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్లు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి
గాంధీ భవన్ నుంచి పార్టీ కార్యకర్తలతో ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన ఉత్తమ్ కేసీఆర్ సర్కారుపై మండి పడ్డారు. నూతన మున్సిపల్ చట్టం లోపభూయిష్టంగా తయారు చేశారని, స్వయంగా గవర్నరే దానిని తిప్పి పంపారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు, వార్డుల వారీగా విభజన చేసి మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద శక్తిగా ఎదిగే అవకాశం లేదని, గత లోకసభ ఎన్నికల్లో అదృష్టం కొద్దీ నాలుగు స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సీబీఐచే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. 22న దిల్లీలోని ఇందిరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తుమ్మిడి వెళ్తాం... అడ్డొస్తే ఊరుకోం..
వచ్చే ఆదివారం తుమ్మిడి హెట్టి దగ్గరికి కాంగ్రెస్ బృందం వెళ్లనున్నట్లు వెల్లడించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్రంలో అధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను హింసిస్తే చూస్తూ ఊరుకోబోమని...ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలకు అండగా నిలువడంతోపాటు ఇబ్బంది పెట్టే అధికారులపై పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: 'యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి'