ప్రజల రోజువారీ జీవనంపై లాక్డౌన్ ఎంత ప్రభావం పడింది అనే అంశంపై భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయన కేంద్రం సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా యూనివర్సిటీ ఆఫ్ చికాగోబూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నివేదిక రూపొందించింది. ఆర్థిక వనరులు, సరకులు నిండుకుంటుండటంతో దేశ, రాష్ట్ర ప్రజల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోందని ఈ సర్వేద్వారా వెల్లడైంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోయిన కుటంబాలు 84 శాతమని... రాష్ట్రంలో 20 శాతం కుటుంబాలపై తీవ్రప్రభావం పడిందని నివేదికలో పేర్కొంది.
మనుగడ కష్టం..
పట్టణ, గ్రామీణ పేద కుటుంబాలకు అదనపు సాయం అందించకుంటే తీవ్రమైన ఆర్థిక కష్టాలతో జీవన మనుగడ కష్టమవుతుందని నివేదిక పేర్కొంది. పేదలు, అల్పాదాయ వర్గాలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా పోషకాహార లోపం తలెత్తుతుందని తెలిపింది. ఆయా వర్గాలకు వెంటనే నగదు బదిలీ అమలు చేయడం ద్వారా వేగంగా కోలుకునేలా చేయవచ్చని అభిప్రాయపడింది.
తక్కువ ఆదాయం ఉన్నవారికి ఎక్కువ నష్టం
లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో నెలవారీగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువ ఆదాయం నష్టపోయాయి. రూ.3801 నుంచి రూ.8142 వరకు ఆదాయం కలిగిన కేటగిరీల్లో సగటున 92 శాతం మంది నష్టపోయారు. మరోవైపు నిరుద్యోగ రేటు 7.4 శాతం నుంచి 25.5 శాతానికి పెరిగింది.
ఇవీ చూడండి: చెప్పిన రకం వరి వేయకపోతే... రైతుబంధు వర్తించదు