జూన్ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నిర్ణయించింది. జీతాలు, పెన్షన్ల కోతపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో వేతనాల కోత, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదని, కోరుకున్న రంగాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ... ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మాత్రం మూడు నెలలుగా కోత విధించడం న్యాయం కాదన్నారు. వేతనాల్లో కోతల వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టకాలంలో వేతన జీవుల ఉసురు తీయడం ప్రభుత్వానికి భావ్యం కాదని అన్నారు. జూన్ నెల నుంచి పూర్తి వేతనంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... మంగళవారం నాడు ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని నిర్ణయించారు. ఈ నెల 24,25 తేదీల్లో ట్విట్టర్, ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు.. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శికి వినతులు పంపాలని సూచించారు.
ఈ నెల కూడా పూర్తి చెల్లింపులు చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలన్న ఐక్యవేదిక... ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలన్నీ ఈ ఐక్యఉద్యమంలో కలిసిరావాలని కోరింది.
ఇదీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్