కొద్దిరోజుల్లోనే కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిలో పూర్థిస్తాయి సౌకర్యాలు కల్పించి కొవిడ్ రోగులకు అందుబాటులోకి తెస్తామని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దిన ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సిబ్బందిపై... ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రెండవ దశ కేసులు దేశంలో విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మేడ్చల్ జిల్లా బొల్లారంలోని కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు.
దిల్లీలో రక్షణశాఖ మంత్రిని కలిసి కంటోన్మెంట్ ఆస్పత్రికి కావలసిన నిధులను మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆక్సిజన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాలకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకునే అవకాశం కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా విశ్రాంత వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తాత్కాలికంగా తీసుకుని... బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాజకీయాలు మానుకుని విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్