Kishan Reddy inspected Swapnalok complex: సికింద్రాబాద్‌లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎక్కువ ఆదాయం వస్తోందని ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారని.. తర్వాత మర్చిపోతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నగరంలో గోదాంలు, స్క్రాప్ దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రమాదాలకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన అన్నారు. ప్రమాదాలకు తావున్న గోదాంలను శివారు ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
జనావాసాల మధ్య స్క్రాప్ గోదాములు ఉంచకూడదని అన్నారు. ప్రభుత్వం ఫైర్ సిబ్బందిని, అధునాతన యంత్రాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస ప్రమాదాల వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నగరంలో ఉన్న పాత అపార్ట్మెంట్స్పై పర్యవేక్షణ చేయాలని సీఎస్‌కు లేఖ రాస్తానని తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాశానని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా కమిటీలు వేసి.. ఆ తర్వాత మరచిపోతున్నారని ఆయన విమర్శించారు. స్వప్నలోక్ బిల్డింగ్ విషయంలో నిపుణులు ఏది సూచిస్తే ప్రభుత్వం అది అమలు చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు.
"ప్రతి ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన యువత కలలు మంటల్లో కాలిపోయాయి. జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ప్రమాదాలు జరిగితే గానీ చర్యలు తీసుకోవడం లేదు. జనావాసాల మధ్య స్క్రాప్ షాపులు ఉండకూడదు. ప్రభుత్వం ఫైర్ సిబ్బందిని, అధునాతన యంత్రాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలి. సిబ్బంది తక్కువగా ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక శాఖకు కొత్తగా వచ్చిన పరికరాలు సమకూర్చాలి. ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోంది. ఎక్కువ ఆదాయం వస్తుందని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు అడిగే సంస్థల గురించి నిరుద్యోగ యువత మాకు సమాచారం ఇవ్వాలి. ప్రమాదంపై ప్రధానితో మాట్లాడి ఆర్థిక సహాయం కోరాను. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు". కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి:
స్వప్నలోక్ మృతుల కుటుంబాలకు.. రాష్ట్రప్రభుత్వం బాసట
స్వప్నలోక్ భవనాన్ని కూల్చాలా.. వద్దా..? పరిశీలించిన జేఎన్టీయూ టీమ్
స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం