వానా కాలం వ్యవసాయ సీజనులో సాధారణ బియ్యం కోటా పెంచేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని కేంద్రం ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తెలంగాణలో సాధారణ వరి విస్తీర్ణం 34 లక్షల ఎకరాలు కాగా 61.97 లక్షల ఎకరాల్లో సాగయినట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. సాధారణ విస్తీర్ణం కన్నా సుమారు 82 శాతం అదనంగా వేశారు. ఆ మేరకు 138 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని లెక్కలు కట్టారు. వాటి నుంచి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయన్నది అంచనా. దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి బియ్యం సేకరణలో భాగంగా తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం 90 లక్షలు మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కోరింది. వానా కాలంలో వచ్చేది సాధారణ బియ్యమే. ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంతగా సుముఖత చూపనప్పటికీ సాధారణ రకం ఎన్నైనా తీసుకునే వీలుంది.
కిందటి వానా కాలంలో ఇలా..
గడిచిన వానా కాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 48.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 31.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థకు(ఎఫ్‌సీఐకి) అందజేశారు. ఈ దఫా 90 లక్షలు ఇస్తామనటంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత అదనపు కోటాపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర యంత్రాంగానికి కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్రం నియమించే ఉన్నత స్థాయి కమిటీలో ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారని సమాచారం. కమిటీ ఏర్పాటు, విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
ఇటీవల కేంద్రానికి రాసిన లేఖలో ఏముందంటే..
ప్రస్తుత వానాకాలంలో వరి దిగుబడి భారీగా రానుంది. ఈ నేపథ్యంలో బియ్యం తీసుకునే కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని.. ఇటీవల రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ మేరకు ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖకు పౌరసరఫరాలశాఖ లేఖ (Letter to Central Government) రాసింది.
ఈ సీజనులో తాజా గణాంకాల ప్రకారం 61.75 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం 34 లక్షల ఎకరాలే కానీ ఈసారి అదనంగా మరో 28 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇటీవల నీరు పుష్కలంగా ఉండటంతో పాటు వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రతి సీజనులోనూ సాధారణ విస్తీర్ణం కన్నా అధిక మొత్తంలోనే ధాన్యం వస్తోంది. ఈసారి అత్యధికంగా 1.38 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ సాధారణ బియ్యం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆహార మంత్రిత్వ శాఖ లేఖ (Letter to Central Government) రాసింది. దేశంలోని ఏయే రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో తీసుకునేది సీజను ఆరంభానికి ముందుగానే కేంద్రం సమాచారం పంపిస్తుంది. వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో కోటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 1.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని... కనీసం 90 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవసాయ సీజనులో చేసుకునే ఒప్పందంలో సాధారణ బియ్యం ఎంతైనా తీసుకుంటామనే అంశం ఉంటుంది.
ఇదీచూడండి: Yasangi season in telangana: యాసంగిలో 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు!