Ugadi Special 2023: ఉగాది.. తెలుగు సంవత్సరాది. తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన పండగ. తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు, వగరు అనే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడి మనకెంతో ప్రత్యేకం. జీవితంలో అన్ని రకాల కష్టాలు వస్తాయి. అన్నిటినీ సమానంగా ఎదుర్కోవాలనే సందేశమిస్తుంది. ఈ ఆరు రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే చాలా బాగుంటుంది.
తీపి: ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరిగినప్పడు తీయటి పదార్థాలు తప్పనిసరి. ఏదైనా మంచి జరిగినా, శుభవార్త విన్నా, ఏదైనా సాధించినా నోరు తీపి చేస్తారు. అచ్చం మనం కూడా ఆ తీపి పదార్థాల లాగే ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషం అనే తీయదనాన్ని పంచాలి. మన పనులు సైతం ఇతరులకు స్వీట్ నెస్ యాడ్ చేసేలా ఉండాలి.
కారం: తినే పదార్థాల్లో కారం ఎక్కువైతే అంతే సంగతులు. మొత్తం తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కారం ఎక్కువుందని తిండి మానేయలేం కదా.. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఎలాగోలా పూర్తి చేస్తాం. అలాగే.. జీవితంలో కూడా కారంలాంటి కష్టాలు, ఎత్తు పల్లాలు అనేకం వస్తాయి. అవి వచ్చినప్పుడు.. కుంగిపోకుండా ముందుకెళ్లాలి. ఆ సమయంలో పరిస్థితులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా.. వాటిని అనుకూలంగా మార్చుకోండి.
చేదు: చేదు అనేది కొన్నిసార్లు చెడుకు సూచన. కాకర, కషాయం తప్ప.. కొన్ని చేదు పదార్థాలను తినలేం. ఎందుకంటే అవి మనకు చెడును కలిగిస్తాయి కాబట్టి. అలాగే మన జీవితంలోనూ మనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండండి. అవి మనుషులే కావచ్చు. అలవాట్లు, అభిరుచులే కావచ్చు. మరి ఏ ఇతరవైనా కావచ్చు. వ్యక్తి గతంగా నీవు వాటి వల్ల లేదా వారి వల్ల ప్రభావితమైనట్లు, హాని కలుగుతుందని అనిపిస్తే అలాంటివాటికి దూరంగా ఉండటమే మేలు.
ఉప్పు: మన మాటలెప్పుడూ ఉప్పు కలిపిన పదార్ధాల్లా ఉండాలి. ఇంట్లో పొద్దున్నే చేసే అల్పాహారం నుంచి మొదలు సాయంత్రం స్నాక్స్, రాత్రి వండుకునే కూరల వరకు అన్నింటిలో ఉప్పు తప్పనిసరి. తీపి తప్ప మిగిలిన కొన్ని పదార్థాలను ఉప్పు లేకుండా తినలేం. అలాగే మన మాటలు సైతం ఉండాలి. వినసొంపుగా.. ఎవ్వరినీ నొప్పించకుండా ఉండాలి. అది ఏ సందర్భంలోనైనా సరే.
పులుపు: పుల్లగా ఉండే పదార్థాలను కొన్ని సార్లు తినటం కష్టమే. అయినప్పటికీ అవి కొన్ని సార్లు మనకు మేలు చేస్తాయి. నిమ్మ, ఉసిరి, ఇతర సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అలాగే మనం కూడా కొన్ని పనులు చేయడానికి అంతగా ఇష్టం చూపించం. అది పెద్దవాళ్లు చెప్పారనో, లేదా మరే ఇతర కారణమైనా కావచ్చు. కానీ.. అవి చేయడానికి మనకు ఇబ్బంది అనిపించినా చేయండి. ప్రారంభంలో కష్టంగా అనిపించినా.. చివరికి ఫలితం మంచిగానే ఉంటుంది అని నమ్మండి.
వగరు: వగరు అంటే సరైన రుచి పచి లేనిది. అంటే అటు తియ్యగా, ఇటు పుల్లగా, చేదుగా లేకుండా.. సక్రమ రుచి అంటూ ఉండదు. దీన్ని వెక్కిరింతకు సైతం ఉపయోగిస్తారు. మన జీవితం సైతం ఇతరులు వెక్కిరించకుండా సక్రమమైంగా ఉండాలి. మనం చేసే దానిపై మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. గోడ మీద పిల్లిలా కాకుండా.. ఏం చేసినా స్థిరమైన ఆలోచన కలిగి స్పష్టంగా చేయాలి.
ఇవీ చదవండి: