కొవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు డిమాండ్ చేశాయి. జులై 1, 2018 నుంచి 45 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతనాలు అమలు చేయాలని కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాలుగో మహాసభల్లో విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై పలు తీర్మానాలను రాష్ట్ర ఆఫీసు బేరర్లు ప్రతిపాదించారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఏకగ్రీవంగా 27 తీర్మానాలను ఆమోదించారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా సరఫరా చేయుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ విద్యావిధానం-2020ని సమూలంగా సవరించాలన్నారు. పాఠశాల విద్యారంగంలో సమస్యలను అధ్యయనం చేసి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ప్రమోషన్ పొందకుండానే రిటైర్ అవుతున్నారని.. సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులకు నష్టం జరుగుతుందని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు దుర్గాభవాని, సోమశేఖర్, కోశాధికారి కిష్టయ్య, ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు సంయుక్త, రాష్ట్ర కార్యదర్శులు నరసింహారావు, టి.లక్ష్మారెడ్డి, ఎ.వెంకటి, వి.శాంతకుమారి, ఎం.రాజశేఖర రెడ్డి, ఆర్.శారద, జి.నాగమణి, కొండలరావు, గాలయ్య, బి.రాజు, గొప్ప సమ్మారావు, కె.రంజిత్ కుమార్, ఎం.ఆంజనేయులు, జి.అశోక్లతోపాటు వివిధ జిల్లాల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : టీకా పేరుతో సైబర్ వల- చిక్కకుండా ఉందాం ఇలా..