TSSP Constable Candidates Protests at Assembly : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామాకాలపై తీసుకొచ్చిన జీవో 46(GO 46) అగ్గి రాజేస్తోంది. పోలీసు నియామాకాల్లో రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికగా టీఎస్ఎస్పీ పోస్టులను కేటాయిస్తే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని.. అభ్యర్థులు నిరసన బాట పట్టారు. తక్షణమే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. డీజీపీ కార్యాలయ ముట్టడికి గ్రామీణ జిల్లాల నిరుద్యోగులు యత్నించారు.
డీజీపీ కార్యాలయం(DGP Office) ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు ర్యాలీగా రావడంతో.. అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకొని అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి అభ్యర్థులు పరుగులు తీశారు. వారిని అడ్డుకొని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు తీవ్ర వాగ్వాదం జరగడంతో.. కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
GO 46 Controversy Telangana : TSSP నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో 46
TSLPRB Latest News : గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నట్లు.. జీవో 46 కారణంగా రూరల్ ప్రాంతాల అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. జీవో 46తో కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
GO 46 Issue in Telangana : కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల భర్తీ జరగాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా తెరపైకి వచ్చిన సీడీసీ అంశం తాజా వివాదానికి కేంద్రమైంది. టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాల్లో లేని కారణంగా పొరుగునే ఉన్న మూడు, నాలుగు జిల్లాలను కలిపి సీడీసీ క్యాడర్‌ను నిర్ణయించారు. ప్రస్తుత జనాభా లెక్కలు అందుబాటులో లేకపోవడంతో.. ఉద్యోగ నియామాకాల్లో 2011 జనగణన ఆధారంగా చేసుకుని భర్తీ చేయనున్నారు.
పోలీసు నియామాకాల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులను కేటాయిస్తే గ్రామీణ జిల్లాలకు తక్కువ పోస్టులు వస్తాయి. దాంతో అక్కడ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఫలితంగా ఎక్కువ మార్కులు (TSSP Cutoff) సాధించినా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోతారనేది గ్రామీణ అభ్యర్థుల ప్రధాన అభ్యంతరం. జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఎక్కువ పోస్టులుండటంతో అక్కడి అభ్యర్థులు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం పొందే అవకాశం ఉండటంతో తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"పోలీసు నియామాకాల్లో జీవో 46 అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే పరిస్థతి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్నాము. అంతా వృథా అయిపోతుంది. ప్రభుత్వం తక్షణమే జీవో 46 ను ఉపసంహరించుకోవాలి. పాతపద్ధతిలో నియామాకాలు జరపాలి". - గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు