TSRTC Collects Extra amount For Toll Charges: దేశవ్యాప్తంగా ధరల భారం.. సామాన్యుల జేబుకు చిల్లులు పెడుతోంది. ఇప్పటికే ఇంట్లో వినియోగించే నిత్యావసర సరకుల నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్ని ధరలు పెరిగి నెలవారీ ఖర్చులను పెంచేశాయి. ఇది చాలదన్నట్లు.. కొత్తగా మరిన్ని భారాలు సామాన్యుడి నెత్తిన పడనున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ఛార్జీలను కేంద్రం 5 శాతం పెంచింది. డబ్ల్యూపీఏ, జీడీపీ గణాంకాల ఆధారంగా ఏటా టోల్ ఛార్జీలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతోంది. అందులో భాగంగా ఈసారీ 5 శాతం పెంచింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
మినీ బస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతిభారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా ఏప్రిల్ 1 నుంచి 5 శాతం వసూలు చేయనున్నారు. పెరిగిన ఈ టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ధరలు సైతం నిర్ణయించింది.
ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్ బస్సులో రూ.20 టోల్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్ ప్లాజాల మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటిపైనా రూ.4 పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
టోల్ ఛార్జీల పెంపుతో కేంద్రం ఇప్పటికే ప్రజలకు షాక్ ఇచ్చింది. వీటికి టీఎస్ఆర్టీసీ, మెట్రో సైతం తోడయ్యాయి. నగరంలోని మెట్రో సైతం ప్రజలపై భారాన్ని మోపడానికి సిద్ధమైంది. హాలీడేస్ లో తిరగడానికి వీలుగా ఉన్న స్మార్ట్ కార్డు (సూపర్ సేవర్ హాలీడే కార్డు) ఛార్జ్‌ను భారీగా పెంచింది. సెలవు రోజుల్లో ప్రయాణించే ఈ కార్డు రీఛార్జి ధర మొదట్లో రూ.59గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.99 కి పెంచారు. దీనికి తోడు మెట్రో స్మార్టు కార్డు ఉన్నవారికి ఇచ్చే డిస్కౌంట్‌ను రద్దీ వేళల్లో పూర్తిగా ఎత్తి వేశారు. స్మార్డు కార్డు తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఉండేది. ఇప్పుడది కూడా లేదు. దీంతో రోజూ తిరిగే అనేక మంది ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది.
టోల్ ఛార్జీల పెంపు వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతుందని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గడిచిన 9 ఏళ్లలో టోల్ ఛార్జీల వసూలు 300 శాతం పెంచారని అందులో పేర్కొన్నారు. తెలంగాణ పరిధిలో మొత్తం 32 టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.
ఇవీ చదవండి: