Ts Highcourt hearing on TSPSC Paper Leakagae Today: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తదితరులు వేసిన పిటిషన్‌పై నేడు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ జరపనున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై గతంలో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించిన ప్రభుత్వం... ఇవాళ కౌంటరు దాఖలు చేసే అవకాశం ఉంది.
TSPSC Paper Leakagae Issue Latest Update: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు రోజుల క్రితమే కౌంటరు దాఖలు చేసింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌పై పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున లీగల్ నోడల్ అధికారి సుమతి కౌంటరు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును కౌంటరులో టీఎస్పీఎస్సీ కోరింది. కాన్ఫిడెన్షియల్ గదిలోని సమాచారం బయటకు వెళ్లిందన్న అనుమానంతో బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఆ తర్వాత కేసు సిట్‌కు బదిలీ అయిందని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు కమిషన్ వివరించింది. ముందస్తు చర్యగా మూడు పరీక్షలు వాయిదా వేయడంతో పాటు.. నాలుగు పరీక్షలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఆరోపణల్లో నిజం లేదని... పిటిషన్‌ను కొట్టివేయాలని కమిషన్ కోరింది. పిటిషన్ వేసిన బల్మూరి వెంకట్, తదితరులు కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.
సీబీఐకి ఈ ప్రశ్నపత్రాల దర్యాప్తు అప్పగించాలి: టీఎస్‌పీఎస్సీ సభ్యులు, ఐటీ శాఖలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నందున వాటన్నింటిపై సిట్ దర్యాప్తు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సిట్ కార్యాలయానికి పిలకుండా ఆయన వద్దకే వెళ్లి విచారించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. సాంకేతిక, ఫోరెన్సిక్ దర్యాప్తు చేయలేదన్నారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలున్న పోలీసు అధికారికి సిట్ బాధ్యతలు అప్పగించారన్నారు. కేసులో అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉన్నాయని.. విదేశాల నుంచి కూడా వచ్చి పరీక్షలు రాశారని తెలిపారు. గతంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలపై దర్యాప్తు చేసిన అనుభవం ఉన్న సీబీఐకి దర్యాప్తు అప్పగించాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఏఐసీసీ లీగల్ సెల్ ఇంఛార్జి వివేక్ ఠంకా వాదించనున్నారు.
ఇవీ చదవండి: