oxygen levels in ponds: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ 4 మిల్లీ గ్రాములు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే జలచరాలు బతకలేవు. బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటిలో 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి. ఈ రెండింటి తీవ్రత ఆధారంగానే చెరువు, కుంటల్లో ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తారు. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గితే బయాలిజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. అంటే... ఆ చెరువులో కాలుష్య తీవ్రత పెరుగుతుందని అర్థం చేసుకోవాలి.
జీహెచ్ఎంసీ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 185 చెరువులున్నాయి. ఈ జాబితాలో 112 చెరువుల్లో పీసీబీ (Telangana State Pollution Control Board) నీటి నమూనాలను సేకరించి సనత్‌నగర్‌లోని ప్రధాన ప్రయోగశాలలో పరీక్షించారు. మిగిలిన వాటిలో నీటి నమూనాలను సేకరించేందుకు సాధ్యం కాలేదు.
ప్రమాద కోరల్లో ఉన్న చెరువులు
Oxygen in 8 ponds is zero: హయత్‌నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరి కుంట, హఫీజ్ పేట్ లోని ఖైదమ్మ కుంట, మదీననగూడలోని ఈర్ల చెరువు, కాటేదాన్‌లోని సులేమాన్ చెరువు, రాజేంద్రనగర్లోని ఎర్రకుంట, మైలార్‌దేవ్‌పల్లి లోని పల్లె చెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువులో ఆక్సిజన్ సున్నాగా ఉన్నట్లు తేలింది. మరో 30 చెరువుల్లో ఒక మిల్లీ గ్రామ్ కంటే తక్కువగా ఉంది. 49 చెరువుల్లో నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగా ఉంది. 25 చెరువుల్లో మాత్రమే 4 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. బయాలిజికల్ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం 84 చెరువుల్లో ప్రమాదకరంగా ఉంది.
అవే కారణం
మురుగు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా చెరువుల్లోకి వదలడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని పరిశోధనల్లో తేలింది. వాటితో పాటు ప్రమాదకర రసాయన వ్యర్థాలు, చెత్త, బయోమెడికల్ వేస్ట్ తదితర వ్యర్థాలు నేరుగా చెరువులో కలుస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిపై అప్రమత్తకాకపోతే భవిష్యత్తులో జలచరాల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: Genetic testing : 'కేన్సర్, గుండెపోటు ముప్పును ముందే పసిగట్టవచ్చు'