రాష్ట్రంలో ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులకు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ వర్తింపచేయాలని టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. శాసనసభ భవనంలో తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై రైతులకు సేవ చేస్తూ రైతుల ప్రతినిధులుగా ఉంటున్న సహకార సొసైటీ అధ్యక్షులకు ప్రోటోకాల్ వర్తింపచేయడం అంటే రైతులను గౌరవించడమేనని రవీందర్‌రావు అన్నారు. నాబార్డు ప్రత్యేక రుణం ద్వారా సొసైటీ కార్యాలయాలను బహుళార్థ సేవా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న పథకంలో నిబంధనలను సవరించాలని మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్మాణం విషయంలో నూతన టెండర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్న సమాచారం ఉందన్న రవీందర్ రాలు అలా చేస్తే ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి నష్టపోతాయని తెలిపారు. గత నియమాల ప్రకారం నామినేషన్ పద్దతిలోనే వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పంచాయతీల నిధులు స్థానిక నిర్ణయం మేరకే ఖర్చు: సీఎం