తెలంగాణ విద్యుత్ సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల యూనియన్ కోరింది. ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి వీడాలని టీఎస్‌యూఈఈయూ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని కార్మిక భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి గోవర్ధన్ విన్నవించుకున్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ నిబంధనలు వర్తించాలని.. వారికి పర్సనల్ పేను బేసిక్‌లో కలపాలని సూచించారు. వారి కాంట్రాక్ట్ సర్వీసును పరిగణనలోకి తీసుకుని గ్రాట్యూటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ చతుర్వేదికి వినతిపత్రాన్ని సమర్పించారు.