రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.12,461 కోట్ల రుణం సేకరించింది. ఏప్రిల్, మే నెలల్లో నెలకు రూ.4 వేల కోట్ల చొప్పున, జూన్‌లో రూ.4,461 కోట్ల అప్పు తీసుకొంది. ఇదే సరళిలో రుణసేకరణ సాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నాటికి తీసుకునే రుణాలు రూ.49,884 కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది 2018-19(రూ.26,740 కోట్లు) కంటే 86%, 2019-20(రూ.37,109 కోట్లు) కంటే 34% అధికం కానుంది.
బీ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి తెలంగాణ గత 4 నెలల్లో 3 నెలలపాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్), 2 నెలల పాటు చేబదుళ్లు(వేస్ అండ్ మీన్స్-డబ్ల్యుఎంఏ) తీసుకుంది. అయితే ఏ నెలలోనూ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లకపోవడం కొంత ఉపశమనం కలిగించే అంశం. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద రుణం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తాను పెట్టిన పెట్టుబడులను పూచీకత్తుగా పెట్టాల్సి ఉంటుంది. అలా తీసుకున్న రుణంపై రెపోరేటు కంటే 1% తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చేబదుళ్లకు మాత్రం రెపోరేటుపై అదనంగా 1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి- నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత