పంచాయతీరాజ్ సమ్మేళనాలను జిల్లాల వారీగా సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అధికారులతో నిర్వహించాలని మంగళవారం నాటి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సమ్మేళనాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని తెలిపారు. పక్షం రోజుల్లోగా సమ్మేళనాలు నిర్వహించి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విధులు, బాధ్యతల గురించి ప్రజాప్రతినిధులకు వివరించాలని చెప్పారు.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ సమ్మేళనాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలన్న ప్రభుత్వం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 25వరకు పూర్తి చేయాలని తెలిపింది.
జిల్లాల వారీగా సమ్మేళనాలకు ఆహ్వానించాల్సిన మంత్రుల పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులను కొత్త జిల్లాల వారీగా విభజించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే మంత్రి ఉంటే ఆ పరిధిలోని అన్ని జిల్లాలకు సదరు మంత్రినే ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల - ఇంద్రకరణ్ రెడ్డి
- సిరిసిల్ల - కె.టి.రామారావు
- కరీంనగర్ - గంగుల కమలాకర్
- పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
- జగిత్యాల - ఈటల రాజేందర్
- ఖమ్మం, కొత్తగూడెం - పువ్వాడ అజయ్ కుమార్
- మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ - శ్రీనివాస్ గౌడ్
- వనపర్తి, గద్వాల - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ - టి.హరీశ్ రావు
- సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి - జగదీష్ రెడ్డి
- నిజామాబాద్, కామారెడ్డి - ప్రశాంత్ రెడ్డి
- మేడ్చల్ - మల్కాజ్ గిరి - మల్లారెడ్డి
- రంగారెడ్డి, వికారాబాద్ - సబితా ఇంద్రారెడ్డి
- వరంగల్ గ్రామీణ, జనగాం, భూపాలపల్లి - ఎర్రబెల్లి దయాకర్ రావు
- వరంగల్ పట్టణ, మహబూబాబాద్, ములుగు - సత్యవతి రాథోడ్
ఇదీ చూడండి: నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన