రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎదిగిన నాయకుడు.. రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాక ప్రజలకు ఆయన మరణం తీరని లోటు అన్నారు. మెదక్ జిల్లాలో ఎగసిపడిన ఉద్యమానికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు. రామలింగారెడ్డి ప్రతిభ, చురుకుతనం కలిగిన వ్యక్త అని కొనియాడారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి కేటీఆర్ సంతాపం..
రామలింగారెడ్డి లేరనే ఆలోచన బాధ కలిగిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిరాడంబరత, కలుపుగోలుతనం ఉన్న గొప్ప నేత. ఉద్యమంలో కేసీఆర్ వెంట తుదివరకు నిబద్ధతతో నడిచిన నేత రామలింగారెడ్డి అన్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాసేవలో నిమగ్నయ్యేవారని గుర్తు చేశారు.
ప్రశాంత్‌రెడ్డి....
రామలింగారెడ్డి... చిన్నాపెద్దా చూడకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ అప్పగించిన పనిని సైనికుడిగా పూర్తి చేసేవారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా సాధారణ జీవితం గడిపేవారని గుర్తుచేశారు. ఆయన మృతి బాధకరమన్నారు.
కొప్పుల ఈశ్వర్..
రామలింగారెడ్డి మృతి అందరికీ కంటతడి పెట్టించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థి దశ నుంచే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేవారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేవారు. తెలంగాణ ఉద్యమంలో పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి రామలింగారెడ్డి అన్నారు.
భట్టి విక్రమార్క..
సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క శాసనసభలో సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్