దేశంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదగడం భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు సర్వశక్తులనూ ఉపయోగిస్తోందని.. త్వరలోనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. అయితే, కేంద్రం దండయాత్రకు ఏ మాత్రం భయపడేది లేదని.. ఇతర రాష్ట్రాల మాదిరిగా భాజపా ఆటలు ఇక్కడ సాగవని స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని.. దర్యాప్తు సంస్థలకు అవకాశమిచ్చే ఏ పనీచేయవద్దని సూచించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు 6, 12, 13 తేదీల్లో జరుగుతాయన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నామని.. రాష్ట్ర నేతలకు అక్కడ మంచి అవకాశాలుంటాయని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
మునుగోడులో భాజపాకు మూడో స్థానమే: వచ్చే శాసనసభ ఎన్నికల్లో 80 నుంచి 90 స్థానాల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. అన్ని సర్వేలూ మన పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. బాగా పనిచేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఖాయం. మునుగోడు ఉపఎన్నికలో 200 శాతం మనమే గెలుస్తున్నాం. అక్కడ కాంగ్రెస్‌ది రెండోస్థానం కాగా... భాజపాకు మూడో స్థానం దక్కుతుంది.
- సీఎం కేసీఆర్
‘‘కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రత్యర్థులపై దాడులు చేయించి రాజకీయ అస్థిరత సృష్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి కుట్రలకు పాల్పడుతోంది. దేశంలో అలజడులు, అల్లర్ల వంటి వాటికి విదేశీ నిధులను సమీకరించిన సందర్భాల్లో మాత్రమే ఈడీ వంటి సంస్థలను వినియోగించాలి. కానీ, భాజపా ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటోంది. రాజకీయ కారణాలతో రాష్ట్రాల్లో దాడులు నిర్వహించడానికి ఈ సంస్థలకు అధికారం లేదు. ఈడీ దాడులకు భయపడి 691 మంది వ్యాపారులు మన దేశంలో పెట్టుబడులను ఉపసంహరించుకొని విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణలోనూ దాన్ని ప్రయోగించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే శివసేన, ఆర్జేడీ, ఆప్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. మహారాష్ట్రలో భాజపా పాచికలు పారాయి.. కానీ, బిహార్, దిల్లీల్లో విఫలమయ్యాయి. తప్పు చేసిన వారు భయపడతారు. మనకేం ఆ భయం లేదు. దమ్ముంటే ఈడీ, ఐటీ, సీబీఐలు రావాలని ఇప్పటికే సవాల్ చేశా. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్ర పర్యటనలో స్థాయి దిగజారి మాట్లాడారు. కేంద్ర మంత్రులందరిదీ ఇదే వైఖరి. కేంద్రం మనపై మరింత దాడి చేస్తుంది. భాజపా బెదిరింపులను పట్టించుకోవద్దు.
మనదే గెలుపు: రాష్ట్రంలో పరిస్థితులు మనకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు మనవైపే ఉన్నారు. బాగా పనిచేసే ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తాం. చెడగొట్టుకుంటే తప్ప ఎవరినీ మార్చాల్సిన అవసరం నాకు లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో స్థానికంగా ఉండి ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో కుటుంబంలా మెలగాలి. మన కార్యక్రమాలు, పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. పెండింగు హామీలన్నీ నెరవేరుస్తాం. మరింతమందికి పింఛను ఇస్తాం. జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.మూడు లక్షల ఆర్థిక సాయం త్వరలో చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో.. మరింతమందికి దళితబంధు, డిసెంబరు చివరి నాటికి మూడు వేల రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం. మునుగోడు మిషన్ వెంటనే ప్రారంభమవుతుంది. అక్కడ మనం మొదటి స్థానంలో ఉన్నాం. కాంగ్రెస్ కంటే 14 శాతం ఆధిక్యం మనకు ఉంది. ఆ నియోజకవర్గంలో రెండు గ్రామాలకో ఎమ్మెల్యేని ఇన్‌ఛార్జిగా నియమిస్తాం..
శాసనసభలో.. శాసనసభ వర్షాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
దేశంలో భాజపా పతనావస్థలో ఉంది. మిత్రపక్షాలన్నీ దూరమై రోజురోజుకూ బలహీనపడుతోంది. ఈ తరుణంలో అసహనంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టింది.
-సీఎం కేసీఆర్