తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెస్)ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, డైరెక్టర్ పదవులకు అభ్యర్థులను తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ జాబితాపై ప్రగతిభవన్‌లో ఆదివారం కసరత్తు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు.
రేపు నామినేషన్ల దాఖలు
రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల్లో 20 మంది డైరెక్టర్లు, డీసీఎమ్మెస్‌లలో 10 మంది డైరెక్టర్ల పదవులకు రేపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఆదివారంనాటి కసరత్తులో దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో డైరెక్టర్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో డైరెక్టర్ స్థానాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్ సూచించారు.
మంత్రి కేటీఆర్‌కు తుది జాబితా
దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల నేతలు సమావేశమయ్యారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కలిసి డైరెక్టర్ పదవులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, మంత్రి కేటీఆర్‌కు జాబితాను పంపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీసీబీ, డీసీఎమ్మెస్ ఛైర్మన్ పదవులపై ఉత్కంఠ ఏర్పడింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, మరో ఇద్దరు నేతలు డీసీసీబీ ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు వేర్వేరుగా మద్దతు తెలపడం వల్ల ఎంపికపై తెరాస అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇవీ చూడండి: ఇదే చివరి సమావేశం: జస్టిస్ ధర్మాధికారి