పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించకుండా కాంగ్రెస్‌ను హింస వైపు మళ్లిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవినేని సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై రేవంత్‌రెడ్డి.. మరోసారి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు ఖండించారు.
రేవంత్ పిల్లి శాపాలకు బెదిరేవారు తెలంగాణలో ఎవరూ లేరని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో ఎందుకు చేరారని తామడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా.. రేవంత్ చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎందరో కుట్రలు పన్నుతున్నారని.. అందులో రేవంత్ ఒకరని అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని వ్యాఖ్యానించారు. గూండాయిజం ద్వారా రాజకీయాలు చేయడాన్ని ప్రజలు హర్షించరన్న సుధీర్‌రెడ్డి.. సంచలనాల కోసం మాట్లాడితే ప్రజలు ఆమోదించరని అన్నారు.
మేము అడిగిన ప్రశ్నలకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. 2017లో నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు నీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు. మళ్లీ ఎలక్షన్‌కు ఎందుకు పోలేదు? ఆ జవాబు చెప్పనంత వరకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు.
- సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
నాలుగు పార్టీలు తిరిగిన రేవంత్ రెడ్డికి తమను విమర్శించే హక్కు లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన మార్చుకోకపోతే.. తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తున్నారు. పిచ్చిపట్టిన వాళ్లలా రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ మొదట నీ చరిత్ర తెలుసుకో. నువ్వు నాలుగు పార్టీలు మారావు. ప్రజల ఆకాంక్ష మేరకే మేము కాంగ్రెస్ నుంచి తెరాసలోకి మారాము. పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌ను.. ప్రజలు చెప్పుతో కొడతారు.
-చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే
రేవంత్ చేసిన వ్యాఖ్యలు..
తెలంగాణలో ఉద్యమ ద్రోహులే రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఎంపీ రేవంత్ ఆరోపించారు. ఎర్రబెల్లి, తలసాని, గంగుల, సబిత, పోచారం తదితరులే పాలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇస్తే.. ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్‌లో ఏముందంటున్నారని దానం నాగేందర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం రాళ్లతో కొడతాం అంటే.. ఎవరో చెప్పులతో కొడతామన్నారు. అలాంటి వారినందరినీ 7వ తేదీ తర్వాత చెప్పుల దండలు వేసి మరీ ఉరికించి కొడతాం’’ అని రేవంత్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: revanth reddy: పార్టీ ఫిరాయింపుదారులను ఉరికిస్తాం..
TRS ON REVANTH: రేవంత్ డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారు: గండ్ర, సుధీర్ రెడ్డి