రాష్ట్రంలో జరగనున్న వరుస ఎన్నికలను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, వాటి విజయమే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. ప్రతి ఎన్నికకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను పెద్దఎత్తున మోహరిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పర్యవేక్షక, సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ.. ప్రతిష్ఠాత్మకం
వచ్చే నెల 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న ఈ స్థానానికి తెరాస అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 80 శాతం వరకు తెరాసకు చెందినవారు ఉండటంతో పార్టీ గెలుపు ధీమాతో ఉంది. అయినా పట్టు సడలనీయవద్దని భావిస్తోంది. ఎన్నికల తేదీ వెలువడిన వెంటనే కేటీఆర్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్, ఇతర ముఖ్యనేతలతో చర్చించి, వారికి శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, కార్పొరేషన్, పురపాలక సంఘాల వారీగా బాధ్యతలు అప్పగించారు.
దుబ్బాక.. లక్ష మెజారిటీ ధ్యేయం
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించగా... అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బిహార్ ఎన్నికలతో పాటు నవంబరులో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనిదే గాక పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటైన దుబ్బాకను మళ్లీ కైవసం చేసుకోవాలని తెరాస ఆశిస్తోంది. లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎన్నికల బాధ్యతలను చేపట్టి, పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు సాగుతున్నారు. రామలింగారెడ్డి భార్య సుజాతారెడ్డి అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతోంది. ఆమెకు మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
పట్టభద్ర నియోజకవర్గాలు కీలకం
వచ్చే మార్చితో వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (తెరాస), రాంచందర్‌రావు (భాజపా)ల పదవీ కాలం ముగుస్తోంది. అంతకంటే ముందే ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సభ్యత్వ నమోదు అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు పట్టభద్ర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల దృష్ట్యా తెరాస ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తోంది. రెండింటినీ గెలిచేందుకు వీలుగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. కేటీఆర్ రెండు స్థానాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కీలకం కావడంతో దానిని పెద్దఎత్తున చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. త్వరలోనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
రాజధానిలో ‘మహా’ పోరు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం గడువు వచ్చే ఫిబ్రవరితో ముగుస్తోంది. డిసెంబరులో ఎన్నికలు జరపాలని తెరాస భావిస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో బహుముఖ ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 150 డివిజన్ల ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతున్నారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు. కేటీఆర్ రోజువారీ సమీక్షలు జరుపుతున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.
ఆ రెండు కార్పొరేషన్లపై కన్ను
వచ్చే మార్చిలో వరంగల్, ఖమ్మం మహా నగరపాలక సంస్థల పాలకవర్గాల గడువు ముగుస్తుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ ఎన్నికలు జరిగే వీలుంది. ఈ రెండు అధికార పార్టీకి ముఖ్యమైన కార్పొరేషన్లు కావడంతో వాటిల్లో మళ్లీ పాగా వేసేందుకు వీలుగా తెరాస కసరత్తు ప్రారంభించింది. రెండు చోట్లా పార్టీ నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. రెండు చోట్లా అభివృద్ధి పనుల వేగం పెంచారు. ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి : దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభం...