TRS Executive Meeting: తెరాస విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరగనుంది. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ, పార్లమెంట్పక్షం, పార్టీ కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది.ఈ సమావేశానికి హాజరు కావాలని తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం పంపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే.. ప్రధాన ఉద్దేశంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పనిచేసేలా నియోజవకవర్గానికి ఒక ఇంఛార్జ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంపై ప్రధాని మోదీ నుంచి, భాజపా రాష్ట్ర నాయకులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. ఎలా తిప్పికొట్టాలనే విషయలపై పార్టీ యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం: ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం ఇస్తామని గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్.. మరోసారి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడంతో.. భాజపా, కాంగ్రెస్‌ల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటనలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారాస ఆవిర్భావ ప్రక్రియ పూర్తికాగానే జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: రేపు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేసీఆర్ శ్రీకారం
'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ