పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల వివరాల సమర్పణలో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా విద్యార్థుల ఫొటోలు, వారి సంతకాలు ఒకరివి మరొకరి స్థానంలో వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది ఏటా పరీక్షలు రాస్తారు. వచ్చే మే నెల 17 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పరీక్ష రుసుం వసూలు చేశారు. ఇంకా అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలంటే విద్యార్థుల డేటా పంపడానికి శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉంది. విద్యార్థుల వివరాలు, ఫొటోలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలి. దీన్ని చేస్తున్న క్రమంలో విద్యార్థుల పేర్లు, వారి వివరాలు సక్రమంగానే నమోదవుతున్నాయి. ఫొటో, సంతకం మాత్రం వారివి ఉండటం లేదు. ఇలా ప్రతి పాఠశాలలో ఒకే విద్యార్థి ఫొటో, సంతకమే ప్రత్యక్షమవుతోంది. కొన్ని చోట్ల తప్పుగా నమోదైన డేటానే సబ్మిట్ చేశారు. అప్‌లోడ్ చేసే సమయంలో తప్పును గుర్తించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు నిలిపివేశారు.
రాష్ట్రమంతటా ఈ సమస్య ఎదురైంది. సాంకేతిక సమస్యలు వస్తే సాంకేతిక సిబ్బందిని సంప్రదించాలని వారి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వివరాలను సరిచేసుకోవడానికి సమయం ఇవ్వాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధికారులకు విన్నవించింది. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా సమయం తక్కువగా ఉండటంతో అందరూ ఒకేసారి అప్‌లోడ్ చేయడం ప్రారంభించడంతో ఫొటోలు, సంతకాలు మారిపోయాయని తెలిపారు. శుక్రవారం నాటికి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అవసరమైతే గడువు పెంచుతామన్నారు. హాల్‌టికెట్లు జారీ చేసే ముందు, తర్వాత, పరీక్షలు ప్రారంభమయ్యే నాటి వరకు పలుమార్లు పొరపాట్ల సవరణకు అవకాశం ఇస్తామని, ఏ ఒక్క విద్యార్థిని కూడా సాంకేతిక కారణాలతో ఇబ్బందిపెట్టమని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజ