Transfers in Telangana Police Department: రాష్ట్ర పోలీసుశాఖలో సంచలనం. ఒకేసారి 91 మంది ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల బదిలీ. ముఖ్యంగా పోలీసుశాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులందరికీ స్థానచలనం కలగడం గమనార్హం. కొత్త డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే భారీస్థాయిలో జరిగిన బదిలీలు పోలీసుశాఖ పనితీరుపై ప్రభావం చూపనున్నాయి.
గందరగోళానికి తెర: రెండో దఫా తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసుశాఖలో జరగాల్సిన సాధారణ బదిలీలు కూడా పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బదిలీలు జరగవచ్చని ప్రచారం తెరపైకి వచ్చినప్పటికీ అత్యవసరమైన ఒకట్రెండు మార్పులతోనే సరిపెట్టుకుంటూ వచ్చారు. ఒకపక్క పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు ఖాళీగా ఉంటుండగా.. మరోపక్క ఒక్కో అధికారి అయిదారు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.
ఇదంతా పోలీసుశాఖలో గందరగోళానికి కారణమైంది. వీటన్నింటినీ సర్దుబాటు చేయాలని అనేకమార్లు పోలీసు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా రాష్ట్ర క్యాడర్‌కు కేటాయించిన దాదాపు 10 మందికి పైగా కొత్త ఐపీఎస్ అధికారులను గ్రేహౌండ్స్‌కు అటాచ్ చేశారు తప్ప పోస్టింగులు ఇవ్వలేదు. అలాగే కొంతమంది అధికారులు నాలుగైదేళ్లుగా ఒకటే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. బుధవారం జరిగిన బదిలీల్లో ఒక్కసారిగా వీటన్నింటినీ దాదాపుగా చక్కదిద్దారు. ఖాళీలు భర్తీ చేయడంతోపాటు చాలాకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న వారికి స్థానచలనం చేశారు. బదిలీలు జరగొచ్చని భావిస్తున్నప్పటీకీ ఒకేసారి ఇన్ని జరుగుతాయని పోలీసు అధికారులు కూడా ఊహించలేకపోయారు.
త్వరలో మరికొన్ని?: పోలీసు శాఖలో ఇన్ని బదిలీలు జరిగినప్పటికీ ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఏడు జోన్లు ఉండగా వాటిలో జోగులాంబ గద్వాలకు ఎల్‌ఎస్ చౌహాన్, రాజన్న సిరిసిల్లకు రమేశ్‌నాయుడును నియమించారు. ఇంకా యాదాద్రి భువనగిరి, భద్రాద్రి, కాళేశ్వరం, చార్మినార్, బాసరలకు డీఐజీలను నియమించాల్సి ఉంది. అలాగే బుధవారం జరిగిన బదిలీల్లో కొంతమందిని మార్చినప్పటికీ వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు.
మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, తెలంగాణ పోలీసు అకాడమీ జాయింట్ డైరెక్టర్ రాఘవేంద్రరెడ్డి తదితరులకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. 2006 బ్యాచ్‌కు చెందిన విశ్వప్రసాద్, రమేశ్‌రెడ్డి తదితరులు త్వరలోనే ఐజీలుగా పదోన్నతులు పొందనున్నారు. వారికి కూడా తగిన పోస్టు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో త్వరలోనే పరిమిత స్థాయిలో మరోసారి బదిలీలు జరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: