తహసీల్దారు కార్యాలయం వేదికగా పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ల సేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఒకే పోర్టల్ వేదికగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి తేవడం, ఏక కాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు అందించే సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాల తయారీ శరవేగంగా పూర్తవుతోంది. ఈ అంశాలపై తహసీల్దార్లకు ఈ నెల 23 లేదా నెలాఖరు నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న 590 మంది తహసీల్దార్లకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దారు సెలవులో వెళ్లినా, ఇతరత్రా కారణాలతో కార్యాలయానికి హాజరు కాలేకపోతే ఆ సమయంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు వీలుగా డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశాలున్నాయి.
పార్ట్-బి సమస్యలకు సర్వేనే మందు
రాష్ట్రంలో వివాదాస్పద భూముల జాబితా ఉన్న పార్ట్-బి సమస్యలకు డిజిటల్ సర్వే అనంతరమే పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 17 లక్షల ఎకరాల భూములు పార్ట్-బి కింద ఉన్నాయి. సమగ్ర సర్వే కన్నా ముందు వివాదాస్పద భూములకు పరిష్కారం చూపనున్నట్లు తెలిసింది. టీఎస్ ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో (ధరణి పోర్టల్) పలు ఐచ్ఛికాలు లేకపోవడం, పలు సమస్యలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండటంతో తహసీల్దార్లు ఈ భూముల విషయంలో ముందడుగు వేయడం లేదు. ఈ క్రమంలో శాటిలైట్ అనుసంధాన డీజీపీఎస్ సర్వే నిర్వహించి పరిష్కరించాలని భావిస్తున్నారు.