దయచేసి వినండి.. మరికొద్ది నిమిషాల్లో బిర్యానీ ఎక్స్‌ప్రెస్ రెండో నంబరు టేబుల్‌పైకి రానుంది. మీరు ఆర్డరిచ్చిన నోరూరించే ఐస్‌క్రీం.. నాలుగో నంబరు టేబుల్‌పై సిద్ధంగా ఉంది. వింటుంటే కొత్తగా ఉంది కదా.. హైదరాబాద్‌లోని ఆహారప్రియులకు సరికొత్త అనుభూతుల్ని పంచేందుకు ట్రైన్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు.. ముగ్గురు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే..
ఆహారరంగంలో ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా.. ఎవరి అవకాశాలు వారివే. రుచికరమైన ఆహారం, చక్కని ఆతిథ్యం అందిస్తే చాలు.. భోజన ప్రియులు కొత్తవారినైనా ఆదరిస్తుంటారు . ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి ఒకవైపు సాఫ్ట్‌వేర్ కొలువులు చేస్తూనే.. వ్యాపారరంగంలోకి అడుగు పెట్టారు.. శివ, నవీన్, మురళి. మియాపూర్ మదినాగూడ జీఎస్ఎం మాల్‌లో ట్రైన్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఆదరణ పొందిన ఈ ట్రైన్ రెస్టారెంట్‌ను నగరవాసులకు పరిచయం చేశారు.
ప్లాట్ ఫాంలా క్యాబిన్లు:
హైదరాబాద్‌లో మొదటి ట్రైన్ రెస్టారెంట్ నిర్వాహకులుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముగ్గురు.. చిన్నపాటి పరిశోధన చేసి.. ట్రైన్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ మొత్తాన్ని ఒక రైల్వే స్టేషన్‌లా మలిచారు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని సర్వర్లకు బదులు రైలు టేబుల్ మీదకు తెచ్చేలా రూపకల్పన చేశారు. ఒక్కో టేబుల్ ఒక్కో ప్లాట్ ఫాం. ఆర్డర్ ఇవ్వగానే.. మీరున్న టేబుల్ ప్లాట్ ఫాం ముందుకు రైలు ఆహారంతో వచ్చి ఆగుతుంది. తీసుకున్న తరువాత తిరిగి వెనక్కి వెళ్లుతుంది. నగరవాసుల్ని మెప్పిస్తున్న రైల్ రెస్టారెంట్.. ముఖ్యంగా పిల్లల్ని బాగా ఆకర్షిస్తోంది. టేబుల్ దగ్గర కూర్చోని ఎప్పుడెప్పుడు రైలు.. తమకు ఆహారం తీసుకొస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. రైలు వచ్చి తమ వద్ద ఆగిన వెంటనే నోరూరించే వంటకాల్ని తీసుకుని పిల్లలు.. సరదాగా భోజనం చేస్తున్నారు.
దేశంలో రెండు మాత్రమే..
ఆలోచన కొత్తగా ఉండటమే కాక.. ఆహారం రుచిగా అందించడం వల్ల 3 నెలల కాలంలోనే వేలాది వినియోగదారుల ఆదరణ దక్కించుకున్నారు రైల్ రెస్టారెంట్ నిర్వాహకులు. చూడటానికి సరదాగా ఉన్నా ఈ రెస్టారెంట్ నిర్వాహణలో పలు సమస్యలున్నాయి. ఖాతాదారుల్ని మెప్పించేందుకు వాటన్నింటిని అధిగమించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశంలో ఈ తరహా రెస్టారెంట్లు రెండు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే తొలి ట్రైన్ రెస్టారెంట్. థీమ్ పైనే ఆధారపడకుండా.. రుచికరమైన ఆహారం, విభిన్న వంటకాల్ని ఎక్కడా రాజీ పడకుండా అందిస్తూ.. ప్రత్యేకత చాటుకుంటున్నారు ట్రైన్ రెస్టారెంట్ నిర్వాహకులు. ఆదరణ బాగుండటం వల్ల ఇతర నగరాల్లోనూ ఈ రెస్టారెంట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇవీ చూడండి: ముగ్గులు.. బొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి