మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లను ట్రాఫిక్ పోలీసులు వదలిపెట్టడం లేదు. తనిఖీలు ముమ్మరం చేసి... శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా రక్తంలో ఆల్కహాల్ శాతం 38 పాయింట్లుగా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే... కేసు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారిని కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం న్యాయస్థానంలోనూ ప్రవేశపెడుతున్నారు. రక్తంలో ఆల్కహాల్ శాతం, గతంలో వాహనదారులు ఇదే తరహాలో పట్టుబడిన ఘటనలను బట్టి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయడం, జరిమానా విధించడం, లేకపోతే కొన్ని రోజుల పాటు శిక్షలు విధించడం లాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి. అయితే రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరికి మాత్రం 6 నెలల జైలు శిక్షపడింది.
ఆల్కహాల్ శాతం 497 పాయింట్లు:
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇద్దరు వాహనదారులకు నూతన చట్టం కింద 6 నెలల జైలు శిక్ష పడింది. రాజు అనే వ్యక్తి గత నెల 16న తన ద్విచక్ర వాహనంపై దమ్మాయిగూడ రహదారి మీదుగా వెళ్తున్న క్రమంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజుకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. రక్తంలో ఆల్కహాల్ శాతం 497 పాయింట్లు ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ట్రాఫిక్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మంగళవారం మల్కాజిగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రాజుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు రాజును చర్లపల్లి జైలుకు తరలించారు.
తప్పించుకు తిరిగి..
కూకట్ పల్లి న్యాయస్థానం కూడా గత నెల 18న ఈ తరహా శిక్షనే విధించింది. నేపాల్‌కు చెందిన బహదూర్ బండేలా మోతాదుకు మించి మద్యం సేవించి రెండుసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. గతేడాది ఆగస్టు 3న ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనాన్ని వదలిపెట్టి కౌన్సిలింగ్‌కు హాజరు కాకుండా బహదూర్ తప్పించుకు తిరిగాడు. మరోసారి ఈ ఏడాది మే 4న మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికినా... కౌన్సిలింగ్‌కు రాలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని నవంబర్ 18న అదుపులోకి తీసుకొని కూకట్ పల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. బహదూర్‌కు 6 నెలల జైలు శిక్ష, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు