జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. శ్వాస విశ్లేషణ పరీక్షలు చేస్తూ... మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 85 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 34 కార్లు, 47 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో ఓ యువతి వాగ్వాదానికి దిగింది. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు పరీక్షల్లో తేలడం వల్ల యువతి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోపోద్రిక్తురాలైన సదరు యువతి వాహనం దిగి పోలీసులతో వారించింది. పోలీసులకు పట్టుబడ్డ మరో యువకుడు, వారిని మాటల్లో పెట్టి వాహనంతో సహా ఉడాయించాడు. వాహనం నెంబర్ ఆధారంగా అతని చిరునామా కనుక్కునే పనిలో పడ్డారు పోలీసులు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం... వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చూడండి: ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర