హైదరాబాద్ మాదాపూర్ నుంచి గాంధీభవన్ వరకు పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) సైకిల్ యాత్ర (cycle tour) చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సుమారు 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటం ఆడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరలు తగ్గించకపోతే... ప్రజల కోరితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి ప్రణాళిక చేస్తానని వెల్లడించారు. ప్లకార్డును సైకిల్ ముందు వైపు ఏర్పాటు చేసుకుని...మధ్యాహ్నం 3:30గంటలకు మాదాపూర్‌లో ప్రారంభించిన సైకిల్ యాత్ర సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్ చేరుకున్నారు.
'కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా మాదాపూర్ నుంచి గాంధీభవన్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాను. కేంద్రంలో భాజపా సర్కారు ధరలను పెంచుతుంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. పెరుగుతున్న ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నేను ఈ సైకిల్ యాత్ర చేశాను.'
-జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.
ఇదీ చూడండి: మొక్కను తిన్న మేకను బంధించిన అధికారులు