కరోనా సహాయక చర్యలు చేపట్టడం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు.. రెండింటిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకు నిరసనగానే దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. సోనియాగాంధీ పిలుపు మేరకు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి సహాయం చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. వారి ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అవకాశం ఉన్నంత మేరకు వలస కార్మికులకు టిక్కెట్లు కొనివ్వాలని... ఎక్కువమంది ఉండి… ఆర్థికంగా భరించలేకుంటే… విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పీఎం, సీఎం కేర్ కింద కోట్లు వసూలు చేస్తున్నా.. వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించక పోవడం దుర్మార్గమని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. వైన్‌షాప్‌ల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని… వాటిని తెరవడం ప్రజా హితమా? కాదా? ఆలోచించాలన్నారు. పేదలకు 1,500లకు బదులు 5 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ నేతల 'రైతు సంక్షేమ దీక్ష' ప్రారంభం