తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు కోదండరాంపై పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ రథసారథిని ఇలా అవమానపరచడమేంటని ప్రశ్నించారు. కోదండరాం పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహించిన వ్యక్తిపై ఇలాంటి దుర్మార్గపు చర్యలకు సమైక్య పాలకులు కూడా దిగలేదని పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాస్కీ గౌడ్ ద్వజమెత్తారు. భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో ఆచార్య కోదండరాంను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు ఆయనపై బల ప్రయోగం చేసి ఒంటి మీద బట్టలు చించేసి దారుణంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు.
సర్కారుపై ధర్మయుద్ధం ఎలా చేద్దాం..
నిరుద్యోగుల ఆకాంక్షల పరిరక్షణే లక్ష్యంగా సర్కారుపై ధర్మయుద్ధం ఎలా ఉంటే కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతుందనే అంశాలపై నిరుద్యోగ నాయకులకు, వివిధ కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లోని మల్కాజిగిరి పార్లమెంటు కార్యాలయంలో జరిగిన సమావేశంలో... టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, నాయకులు బెల్లయ్య నాయక్, వేణు గోపాల్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి డిసెంబరు 9 వరకు... 67 రోజులపాటు ధర్మయుద్ధం కొనసాగనుంది.
ఇదీ చదవండి: high alert in hyderabad: మూసినదికి వరద ఉద్ధృతి.. పలు ప్రాంతాల్లో హై అలర్ట్