నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ "రైతు సంక్షేమ దీక్ష'' చేపట్టనుంది. హైదరాబాద్ గాంధీభవన్‌తోపాటు అన్ని జిల్లాల్లో దీక్ష నిర్వహిస్తున్నట్లు కొవిడ్- 19 పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన వివరించారు. మిల్లర్ల చేతిలో రైతన్నలు దగా పడుతున్నారని హస్తం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
బస్తాల కొరత- పట్టాల ఏర్పాటు, కొనుగోళ్లలో జాప్యం, అక్రమాల వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ధ్వజమెత్తారు. తరుగు పేరుతో రైతుల ధాన్యం నుంచి 8 కిలోల వరకు అక్రమంగా మిల్లర్లు కోత విధించడం లాంటి ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు ప్రభుత్వమే డబ్బు చెల్లించాలని మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను, వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: నేడు తెజస అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్ష