రాష్ట్రంలో భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న వరద బాధితులకు అండగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను, నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రజలను వరదల నుంచి కాపాడాలని కోరారు. లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా అతి భారీ వర్షాలు పడడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారని, లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలకు పంటలు మునిగిపోయిన రైతులకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందించాలని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాధితులకు, నష్టపోయిన వారికి అండగా నిలిచి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వంద ఏళ్లలో ఇంత భారీ వర్షాలు కురవలేదని, ప్రభుత్వం ముందుగానే అందరిని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ఇంత నష్టం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వరదల్లో మరణించిన వారికి కాంగ్రెస్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం మున్సిపల్, విద్యుత్, వాటర్ వర్క్స్, నీటి పారుదల, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సమన్వయం చేసి ప్రజలను ఆదుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో మిలటరీ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వం అందించాలని, కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్